సాక్షి డిజిటల్ న్యూస్ అనంతపురం మే 4 అనంతపురం జిల్లా ఇన్చార్జ్: అనంతపురం జిల్లాలో విలేఖరి లక్ష్మీనారాయణ పై జరిగిన దాడి ఘటనను మేము అనంతపురం దళిత గిరిజన ప్రజా సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒక జర్నలిస్టు తన విధి నిర్వహణలో ఉండగా అతనిపై దాడి చేయడం కేవలం వ్యక్తిగత దాడి కాదు; అది భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛా హక్కులపై, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా మేము పరిగణిస్తున్నాము. భారత సుప్రీంకోర్టు పలుమార్లు స్పష్టంగా జర్నలిస్టులపై దాడులు జరగకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన నేపథ్యంలో, ఈ ఘటనలో పాల్పడిన గీతం కాలేజ్ యాజమాన్యం మరియు వీడియోలో కనిపిస్తున్న ప్రతి ఒక్కరిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా లక్ష్మీ నారాయణ ఇంటికి వెళ్లి బెదిరింపులకు పాల్పడిన వారిపై కూడా కేసులు నమోదు చేయాలి. ఈ ఘటనలో బాధితుడు దళిత వర్గానికి చెందిన జర్నలిస్టు కావున, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కేసు నమోదు చేయడమే కాకుండా, హత్యాయత్నం (అట్టెంప్ట్ టూ మర్డర్) కేసును కూడా నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. అనంతపురం టవర్ క్లాక్ సమీపంలోని ప్రెస్ క్లబ్ వద్ద జరిగిన సంఘటనలో ఒక మహిళ బహిరంగంగా దౌర్జన్యానికి పాల్పడుతూ ఉండగా, అక్కడే ఉన్న పోలీసు అధికారులు ఆమెను నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అత్యంత బాధాకరం మరియు అనుమానాస్పదం. జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేయడంతోనే ఆమె వెనక్కి తగ్గడం, పోలీసుల నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేస్తోంది. ఈ వ్యవహారంపై పోలీసు అధికారుల పాత్రను కూడా విచారణకు లోను చేయాలి.అదేవిధంగా ఆ మహిళకు గీతం కాలేజ్ యాజమాన్యంతో లేదా దాడిలో పాల్గొన్న వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఆమె కాల్ డేటా మరియు సంబంధిత వ్యక్తుల కాల్ డేటాలను పరిశీలించి, కుట్ర కోణంలో కూడా విచారణ జరపాలి. విద్యాసంస్థల పేరుతో ఇలాంటి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడుతున్న గీతం కాలేజ్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుని, అవసరమైతే వారి లైసెన్స్‌ను రద్దు చేయాలని విద్యాశాఖ అధికారులను కోరుతున్నాము. అధికారులపై ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నా, అవినీతికి లొంగకుండా చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలి.పోలీసు అధికారులకు మా వినతి ఏమనగా మీరు చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత కలిగినవారు. వ్యక్తుల ప్రలోభాలకు, ఒత్తిడులకు లోనై మీ విధులను విస్మరించకండి. అలాంటి చర్యలు మీ ఉద్యోగ భద్రతకే ప్రమాదకర మవుతాయి. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీడియా మిత్రులందరికీ మా పిలుపు భారతదేశంలో నాలుగవ స్థంభంగా ఉన్న జర్నలిస్టులందరూ ఏకమై, జర్నలిస్టుల భద్రత కోసం పోరాడాలి. జర్నలిస్టుపై దాడి చేయాలనే ధైర్యం ఎవరికి రాకుండా, చట్టపరమైన పోరాటంతో సమాధానం ఇవ్వాలి. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడేందుకు మనమంతా కలిసి కట్టుగా ముందుకు రావాలి.కాబట్టి పై అంశాలన్నింటిని గమనించి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని మేము మరోసారి గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. అనంతపురం దళిత గిరిజన ప్రజా సంఘాలు.