అవినీతి, మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వంపై సమరభేరి

ఆరు గ్యారంటీల అమలులో వైఫల్యాలను నిరసిస్తూ కోరుట్లలో ఏమ్మెల్యే సంజయ్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ భారీ ధర్నా – 420 అడుగుల హామీల ఫ్లెక్సీతో రోడ్ ప్రదర్శన..

సాక్షి డిజిటల్ న్యూస్ కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్ సెప్టెంబర్ 03 2026. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు ప్రతీకగా 420 అడుగుల భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి, కోరుట్ల బస్ స్టాండ్ అంబేద్కర్ చౌరస్తా నుంచి రోడ్ ప్రదర్శన నిర్వహించారు.ఈ భారీ ఫ్లెక్సీలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను ప్రదర్శిస్తూ, వాటిలో ఎన్ని అమలయ్యాయి, ఇంకా ఎన్ని హామీలు నెరవేరాల్సి ఉందో ప్రజలకు తెలియజేసేలా ప్రదర్శన చేపట్టారు. భారీ ఫ్లెక్సీతో నిర్వహించిన ఈ ప్రదర్శన ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంతకాలం గడిచినా ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని ఎమ్మెల్యే సంజయ్ పేర్కొన్నారు. రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు, పేదలు సహా అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల తరఫున ప్రశ్నించేందుకే ఈ పోరాటం చేపట్టామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.ధర్నా అనంతరం నిర్వహించిన 420 అడుగుల భారీ ఫ్లెక్సీ రోడ్ ప్రదర్శనలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.