
సాక్షి డిజిటల్ న్యూస్ 03 సెప్టెంబర్ 2026 యాదాద్రి జిల్లా గుండాల మండలం రిపోర్టర్ ఎండి ఉస్మాన్ యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల పరిధిలోని అనంతారం గ్రామంలో అమానుషం చోటుచేసుకుంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తూ సబ్సిడీలు ఇస్తుంటే.. మరోవైపు కొందరు రైతుల కష్టాన్ని నిలువునా దహించి వేస్తున్నారు. అనంతారం గ్రామానికి చెందిన బాధిత రైతు , ప్రభుత్వం అందించిన సబ్సిడీని సద్వినియోగం చేసుకుంటూ తన పొలంలో ఎంతో శ్రమకోర్చి ఆయిల్ పామ్ తోటను సాగు చేశాడు. ఎంతో పెట్టుబడి పెట్టి, రాత్రింబవళ్లు కష్టపడి పిల్లల్లా కాపాడుకుంటూ వస్తున్న తోటపై ఓ గుర్తుతెలియని వ్యక్తి కక్షగట్టాడు.తోట రాత్రి సమయంలో తోటలోకి చొరబడిన సదరు గుర్తుతెలియని వ్యక్తి, పామాయిల్ చెట్లను దారుణంగా నరికివేసి ధ్వంసం చేశాడు. ఉదయం తోటలోకి వెళ్లిన రైతు.. నేలకూలిన చెట్లను చూసి గుండె పగిలేలా విలపించాడు. కళ్లముందే చేతికొచ్చే పంట నాశనమవడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. దాదాపు లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సబ్సిడీతో ఎదిగిన పంటను ఇలా నిర్ధాక్షిణ్యంగా ధ్వంసం చేయడంపై స్థానిక రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.బాధిత రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.తోటను ధ్వంసం చేసింది ఎవరు? పాత కక్షలా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తామని వేగవంతం చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించడంతో పాటు, నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కుటుంబం కన్నీళ్లతో వేడుకుంటోంది.