
సాక్షి డిజిటల్ న్యూస్, కామారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 3, (తెలంగాణ స్టేట్ బ్యూరో ఇన్చార్జి కే.కరుణాకర్) : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ గిరి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిపై మండల స్థాయి ఎంపీడీవో లు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగాంతం చేయాలని అధికారులను అదనపు కలెక్టర్ గిరి ఆదేశించారు. మండల స్థాయి అధికారులకు కేటాయించిన 3,408 ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ప్రతిపాదనలను సెప్టెంబర్ 4 వ తేదీలోగా ప్రభుత్వానికి నివేదించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రెండవ విడత మంజూరై, అందులో 1,704 గృహాలకు మార్కౌట్ ఇవ్వడంతో పాటు, లబ్ధిదారుల నిర్మాణ పనులను ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. మొదటి విడతలో మంజూరై పెండింగ్లో ఉన్న ఇండ్ల నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయాలని తెలిపారు. ప్రతి మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను మండల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, శరవేగంగా నిర్మాణ పనులను పూర్తి చేయాలని, తక్కువ వ్యయంలో ఇంటి నిర్మాణం పూర్తయ్యే విధంగా చొరవ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.