
సాక్షి డిజిటల్ న్యూస్, అశ్వారావుపేట, రిపోర్టర్, దాది చంటి, సెప్టెంబర్, 03: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బుధవారం అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, మాజీ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మరో కార్యక్రమం వేర్వేరుగా నిర్వహించబడినప్పటికీ, రెండు కార్యక్రమాల ప్రధాన లక్ష్యం మాత్రం ఒక్కటేనని బీఆర్ఎస్ శ్రేణులు స్పష్టం చేశాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రెండు కార్యక్రమాల్లోనూ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఉప్పల వెంకటరమణ పాల్గొనగా, శ్రీశ్రీ ఫంక్షన్ హాల్ నుంచి రింగ్ రోడ్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వ హామీల వైఫల్యాన్ని ఎత్తిచూపారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను గుర్తు చేస్తూ 420 అడుగుల భారీ ఫ్లెక్సీని ప్రదర్శించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కాసాని నాగశేష పద్మ-చంద్రమోహన్, కౌన్సిలర్ డాక్టర్ ఉదయజ్యోతి-ప్రసాద్ తదితరుల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీ కాసాని పద్మ-చంద్రమోహన్ స్వగృహం నుంచి ప్రారంభమై ఆంజనేయస్వామి ఆలయం యూ-టర్న్ మీదుగా పట్టణంలోని ప్రధాన వీధుల గుండా రింగ్ సెంటర్ వరకు సాగింది. మార్గమధ్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజులు పూర్తయినా ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రైతులు, మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, పింఛన్‌దారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర నాయకులు ఉప్పల వెంకటరమణ కాంగ్రెస్ ఎన్నికల హామీలపై విమర్శలు గుప్పిస్తూ ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీ కార్డులకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కాసాని పద్మ–చంద్రమోహన్, డాక్టర్ ఉదయజ్యోతి–ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసే వరకు బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. రెండు కార్యక్రమాలు వేర్వేరు ప్రదేశాల నుంచి, వేర్వేరు నాయకుల ఆధ్వర్యంలో జరిగినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వ హామీల వైఫల్యాన్ని ప్రశ్నించడం, ప్రజా సమస్యలపై పోరాడటం, బీఆర్ఎస్ శ్రేణులను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం అనే ప్రధాన లక్ష్యంలో ఎలాంటి మార్పు లేదని పార్టీ నాయకులు పేర్కొన్నారు. అశ్వారావుపేటలో రెండు వైపులా పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, యువకులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొనడంతో నియోజకవర్గంలో బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. వేర్వేరు కార్యక్రమాలైనా.. పోరాటం మాత్రం ప్రజల కోసమేనని, కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలు కోసం బీఆర్ఎస్ శ్రేణులు ఐక్యంగా ప్రజల తరఫున తమ పోరాటాన్ని కొనసాగిస్తాయని నాయకులు స్పష్టం చేశారు.