ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించుకోవాలి

సెప్టెంబర్ 16లోగా క్లెయిమ్స్, అభ్యంతరాలు దాఖలు చేసుకోవాలి అర్హత కలిగిన ప్రతి పౌరుడు ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో భాగస్వామి కావాలి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

సాక్షి డిజిటల్ న్యూస్ సెప్టెంబర్ 03 అందోల్ (ప్రతినిధి జెల్ల భాగయ్య) భారత ఎన్నికల సంఘం ఆదేశాలు, మార్గదర్శకాల ప్రకారం ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కొనసాగు తున్నందున, అర్హత కలిగిన ప్రతి పౌరుడు ఈ ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి, ఓటరు జాబితాలో తమ పేరు, ఇతర వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. ఎస్ఐఆర్ షెడ్యూల్‌లో భాగంగా 2026 ఆగస్టు 17న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించడం జరిగిందని తెలిపారు. ముసాయిదా జాబితాలో తమ పేరు, వయస్సు, చిరునామా తదితర వివరాలను పరిశీలించుకోవాలని, ఏవైనా తప్పులు, మార్పులు లేదా అభ్యంతరాలు ఉన్నట్లయితే నిర్దేశిత గడువులోగా సంబంధిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి ఈ ఆర్ వో వద్ద క్లెయిమ్‌లు, అభ్యంతరాలు దాఖలు చేయాలని కోరారు. క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణకు గడువు సెప్టెంబర్ 16 వరకు ఉందని తెలిపారు. అర్హత కలిగిన పౌరులు ఓటరు జాబితాలో తమ పేరు నమోదు, వివరాల సవరణ తదితర అంశాలకు సంబంధించి క్లెయిమ్‌లు, అభ్యంతరాలను సంబంధిత ఈ ఆర్ వో వద్ద నిర్దేశిత విధానంలో సమర్పించవచ్చని పేర్కొన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా స్వీకరించిన క్లెయిమ్స్, అభ్యంతరాల జాబితాలను ప్రజల సమాచారార్థం అందుబాటులో ఉంచుతామని కలెక్టర్ తెలిపారు. సంబంధిత ఈఆర్ఓ లు ఈ జాబితాలను వారానికి ఒకసారి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అందజేస్తారని పేర్కొన్నారు. జాబితాలో చేర్చిన ఏదైనా క్లెయిమ్‌పై అభ్యంతరం ఉన్న పౌరులు నిర్దేశిత విధానాన్ని అనుసరించి సంబంధిత ఈఆర్ఓ ను సంప్రదించవచ్చని తెలిపారు. క్లెయిమ్ లేదా అభ్యంతరంపై సంబంధిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి ఈ ఆర్ వో తీసుకున్న నిర్ణయంపై సంతృప్తి
చెందని వారు మొదటి అప్పీల్ అధికారిగా జిల్లా మేజిస్ట్రేట్ కు అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా, మొదటి అప్పీల్ అధికారి ఇచ్చిన నిర్ణయంపై సంతృప్తి చెందని వారు రెండవ అప్పీల్ అధికారిగా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సీఈవో కు అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని వివరించారు.
ఎస్ ఐ ఆర్ ప్రక్రియకు సంబంధించిన సమాచారం ప్రతి అర్హత కలిగిన పౌరుడికి చేరేలా ప్రచార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ కోరారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడు తమ ఓటరు వివరాలను పరిశీలించుకుని, అవసరమైన చోట క్లెయిమ్‌లు లేదా అభ్యంతరాలను నిర్దేశిత గడువులోగా దాఖలు చేసుకుని ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో భాగస్వాములు కావాలని కలెక్టర్ కోరారు.