విచ్చలవిడిగా నిషేధిత లాటరీ టికెట్ల దందా.!!

మూడు పూలు ఆరు కాయలుగా సాగుతున్న వ్యాపారం - చోద్యం చూస్తున్న అధికారులు.!! మయూరి సెంటర్, రైతుపేట, గాంధీ సెంటర్లలో బహిరంగ విక్రయాలు - యువత బలి.!!

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ : బొక్కా నాగేశ్వరరావు సెప్టెంబర్ 3 2026 నందిగామ పట్టణంలో నిషేధిత లాటరీ టికెట్ల అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ప్రభుత్వం నిషేధించిన సిక్కిం లాటరీ టికెట్లను కొందరు ఏజెంట్లు బహిరంగంగానే విక్రయిస్తూ మూడు పూలు ఆరు కాయలుగా వ్యాపారం చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పట్టణంలో టీ స్టాల్స్ వద్ద, జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో, కటింగ్ షాపులు, హోటళ్ల వద్ద ఈ దందా రాజ్యమేలుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజురోజుకూ పుట్టగొడుగుల్లా ఏజెంట్లు పుట్టుకొస్తున్నారు. అధికారులంటే ఏ మాత్రం భయం, భక్తి లేకుండా బరితెగించి వ్యాపారం చేస్తున్నారు.గుంపులు గుంపులుగా స్థావరాలు..లాటరీ ఏజెంట్లు పట్టణంలో ప్రత్యేక స్థావరాలు ఏర్పాటు చేసుకుని గుంపులు గుంపులుగా కూర్చొని టికెట్లు అమ్ముతున్నారు. ముఖ్యంగా మయూరి సెంటర్, పాత బస్టాండ్ వెళ్లే దారి, రైతుపేట, గాంధీ సెంటర్లలో కుప్పలు తెప్పలుగా కూర్చొని బహిరంగంగానే విక్రయిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఫొటోలో కనిపిస్తున్నట్లు S 387252 సిరీస్ సిక్కిం సూపర్ లాటరీ టికెట్లను యథేచ్ఛగా అమ్ముతున్నారు. యువత, విద్యార్థుల జీవితాలతో చెలగాటంఈ లాటరీ మాయలో పడి అప్పుల పాలై, ఎంతోమంది యువకులు, విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు గతంలో జరిగాయని, అయినా అధికారుల్లో చలనం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలనే ఆశ చూపి, పేద, మధ్యతరగతి ప్రజల నోట్లో మట్టి కొడుతున్నారని విమర్శిస్తున్నారు. ఒకవైపు పోలీసులు అంతరజాల నేరాలపై అవగాహన కల్పిస్తుంటే, మరోవైపు నడిబొడ్డున ఇంత బహిరంగంగా జరుగుతున్న ఈ నిషేధిత లాటరీ దందాను ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పోలీసు, రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి, నందిగామ పట్టణంలోని లాటరీ స్థావరాలపై ఆకస్మిక దాడులు చేసి, నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.