వెయ్యి రోజులు వెయ్యి అబద్ధాలు

- ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి ... - తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యం ... - రైతు వ్యతిరేకత పొందిన మొట్టమొదటి సీఎం రేవంత్ రెడ్డి ... - హామీలు అమలయ్యే వరకు పోరుబాట - మాజీ విప్ గంప గోవర్ధన్ ...

సాక్షి డిజిటల్ న్యూస్, కామారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 3, (తెలంగాణ స్టేట్ బ్యూరో ఇన్చార్జి కే.కరుణాకర్) : దద్దరిల్లిన కామారెడ్డి.. 420 దొంగ హామీలపై విరుచుకుపడ్డ బీఆర్ఎస్ శ్రేణులు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల మోసపూరిత పాలనకు నిరసనగా కామారెడ్డిలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ధర్నా నిర్వహించారు. కామారెడ్డి మున్సిపల్ ధర్నా చౌక్ వద్ద బైఠాయించిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలను ఎండగడుతూ 420 అడుగుల భారీ ఫ్లెక్స్‌ను ప్రదర్శించారు. అనంతరం గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో ప్రజలకు ‘బాకీ కార్డులు’ పంపిణీ చేసి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రజలకు గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా బీఆర్ఎస్ శ్రేణులు చేపట్టిన ఈ నిరసన కార్యక్రమం కామారెడ్డిలో హాట్‌టాపిక్‌గా మారింది. భారీగా బిఆర్ఎస్ శ్రేణులతో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ విప్ గంప గోవర్ధన్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ విధి, విధానాలకు వ్యతిరేకంగా 420 ఫీట్ల భారీ బ్యానర్ ను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. 6 గ్యారంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పరిపాలనలో ప్రజలను దగా చేయడమే కాకుండా, రైతుల నడ్డి విరిచారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు అయ్యే వరకు పోరుబాట ఆగదని, సర్కార్ మెడలు వంచి అయినా హామీల అమలు చేస్తామని అన్నారు. కామారెడ్డి నియోజకవర్గం నలుమూలల నుండి వచ్చిన బిఆర్ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి మాజీ విప్ మాట్లాడుతూ కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ నాయకులు1000 అబద్దాలు ఆడారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పెన్షన్లు, ఉద్యోగాలు, సాగునీటి, విద్యుత్, యూరియా యాప్ ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలోని ప్రజలను ప్రతి విషయంలో కాంగ్రెస్ పార్టీ నిలువునా దగా చేసి మోసం చేసిందని ధ్వజమెత్తారు. ముఖ్యంగా రైతులను యూరియా యాప్ ల పేరుతో వారిని నానా తిప్పలు పెడుతూ, రైతుల వెన్ను విరిచారు. రైతులకు యూరియా యాప్ వాడడం రాదని రైతులు అధికారుల కాళ్లు పట్టుకున్నా కానీ యూరియా ఇవ్వడం లేదని అన్నారు. జిల్లా నుండి పోటీ చేసి జిల్లా రైతాంగానికి, ప్రజలకు రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని, ముఖ్యమంత్రిగా వెయ్యి రోజులుగా రాష్ట్రానికే ఏమీ చేయని రేవంత్ రెడ్డి, జిల్లాకు చేస్తాడని ఎవరు అనుకోవట్లేదని ఎద్దేవా చేశాడు. కామారెడ్డిలో ఓడిపోయి కామారెడ్డి పై కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని అన్నారు. ఆర్టీసీ ప్రయాణంలో మహిళలకు ఉచిత ప్రయాణమని చెప్పి మగవాళ్లకు రెండు, మూడింతలు టికెట్ చార్జీలు పెంచిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదేనని అన్నారు. ఆటోలు నడుపుకునే వాళ్లు ప్రయాణికులు ఆటోలో ప్రయాణించకపోవడoతో ఎందరో సోదరులు మానసికంగా కృంగిపోతున్నారని అన్నారు. రాష్ట్రంలో పాలన గాలికి వదిలేసారని, అవి తప్పించుకోడానికి కెసిఆర్ ని, బీఆర్ఎస్ నాయకులను, తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. రాష్ట్రాన్ని తెచ్చి, ప్రజా సమస్యలపై పోరాడిన కెసిఆర్ కాదు రాజీనామా చేయాల్సింది ప్రజా సమస్యలను గాలికొదిలేసి అన్ని రంగాల్లో విఫలమైనందుకు ప్రజలకు క్షమాపణ చెప్పి రేవంత్ రెడ్డి ముందు సీఎంగా రాజీనామా చేయాలని చురకలు అంటించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ వైస్ చైర్మన్, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్, సీనియర్ నాయకుడు నల్లవెల్లి అశోక్, మండల నాయకులు, కార్యకర్తలు, ఎంపీపీలు, జెడ్పిటిసిలు ఈ నిరసన కార్యక్రమంలో భారీగా పాల్గొన్నారు.