వైఎస్‌ఆర్ ఆశయాల సాధనకు కృషి చేస్తాం జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్‌కుమార్

దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా జగిత్యాలలో ఘన నివాళులు

సాక్షి డిజిటల్ న్యూస్ జగిత్యాల నియోజకవర్గం ఇన్‌చార్జి కొడిపెల్లి సురేష్/ జగిత్యాల, సెప్టెంబర్ 3: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజంగి నందయ్య నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి అనేక సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. పాదయాత్ర సందర్భంగా పల్లెల్లో పర్యటిస్తూ రైతుల సమస్యలను స్వయంగా తెలుసుకున్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, అధికారంలోకి వచ్చిన అనంతరం రైతు పక్షపాత విధానాలు, పథకాలను అమలు చేశారని కొనియాడారు. సాగునీటి అంశాల్లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా స్థానిక నాయకత్వం గతంలో సమర్థవంతంగా పనిచేయలేకపోయిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జగిత్యాలలో ఇందిరమ్మ కాలనీని మంజూరు చేసింది కూడా వైఎస్ రాజశేఖర్‌రెడ్డేనని గుర్తు చేశారు. జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీలో 2008లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారని ఎమ్మెల్యే తెలిపారు. అయితే, ఆ కాలనీలో మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో లేకపోవడంతో అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదన్నారు. 2009 వరకు అక్కడ కేవలం ఒకరు మాత్రమే విద్యుత్ కనెక్షన్ తీసుకున్నారని, 2014 నాటికి ఆ సంఖ్య పదులకే పరిమితమైందని తెలిపారు. 2020 నాటికి 170 మంది వరకు విద్యుత్ కనెక్షన్లు తీసుకున్నారని వివరించారు. అయితే, 2024లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అర్బన్ హౌసింగ్ కాలనీ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ.36 కోట్లు మంజూరు చేయడంతో కాలనీ వాసుల్లో కొత్త ఆశలు చిగురించాయని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతం 2026 నాటికి సుమారు 3,500 మంది విద్యుత్ కనెక్షన్లు తీసుకున్నారని తెలిపారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంజూరు చేసిన ఇందిరమ్మ కాలనీ అభివృద్ధికి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పూర్తి సహకారం అందిస్తున్నారని అన్నారు. కాలనీలో అవసరమైన దాదాపు అన్ని మౌలిక సదుపాయాలను త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు మెరుగైన జీవన వాతావరణం కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, పీసీసీ కార్యదర్శి బండ శంకర్, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణరెడ్డి, పీసీసీ సేవాదళ్ కార్యదర్శి ముఖేష్ కన్నా, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బీరం రాజేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్త మోహన్, ఎన్‌ఎస్‌యూఐ నాయకుడు భార్గవ్, సేవాదళ్ పట్టణ అధ్యక్షుడు ద్యావన్‌పల్లి రాజేందర్, డీసీసీ ఉపాధ్యక్షులు జెల్ల రవి, రేపల్లె హరికృష్ణ, డీసీసీ కార్యదర్శి పులి నర్సయ్య, కూసరి అనిల్, లైశెట్టి చంద్రమౌళి, కోలా శ్రీనివాస్, బాలముకుందం, రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు కొప్పెర వెంకట్‌రెడ్డి, సురేష్, సతీష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.