
సాక్షి డిజిటల్ న్యూస్ 3 సెప్టెంబర్ 2026 (జగిత్యాల జిల్లా ఇంచార్జ్) బోనగిరి మల్లారెడ్డి గొల్లపల్లి మండలం లో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ బొమ్మన కుమార్ లబ్ధిదారులకు స్వగ్రామంలో ఘన స్వాగతం పేదలకు చూపునివ్వడమే అసలైన తృప్తి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ బొమ్మన కుమార్ నిన్నటివరకు వారి కళ్లల్లో ఏదో తెలియని ఆవేదన వయసు పైబడటంతో కంటిచూపు మందగించి, పక్కవారిపై ఆధారపడాల్సిన దీనస్థితి. కానీ, నేడు వారి కళ్లల్లో సరికొత్త కాంతులు.ముఖాల్లో ఆనంద బాష్పాలు. లయన్స్ క్లబ్ మరియు రేకుర్తి కంటి ఆసుపత్రి సంయుక్తంగా అందించిన ఉచిత వైద్య సేవలతో చీకట్లను తరిమికొట్టి, 39 మంది బాధితులు సంపూర్ణ చూపుతో తమ స్వగ్రామమైన గొల్లపల్లికి చేరుకున్నారు. గొల్లపల్లి గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించి కంటి సమస్యలతో బాధపడుతున్న భీమ్‌రాజుపల్లి, లక్ష్మీపూర్, చందోలి, గొల్లపల్లి, బీర్పూర్,రాపల్లి, రాఘవ పట్నం,గ్రామాలకు చెందిన 39 మందిని గుర్తించారు. అనంతరం వారిని లయన్స్ క్లబ్ వాహనంలో కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రికి తరలించి, పైసా ఖర్చు లేకుండా నిపుణులైన వైద్యులతో విజయవంతంగా శస్త్రచికిత్సలు పూర్తి చేయించారు. రెండు రోజుల చికిత్స అనంతరం ప్రత్యేక బస్సులో వీరంతా సురక్షితంగా స్వగ్రామానికి చేరుకోగా, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ బొమ్మన కుమార్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు భావోద్వేగాల నడుమ వారికి ఘన స్వాగతం పలికారు. ఆ కళ్లల్లో కనిపించిన వెలుగే మాకు శ్రీరామరక్ష బొమ్మన కుమార్, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ బొమ్మన కుమార్ మాట్లాడుతూ.నిస్సహాయ స్థితిలో ఉన్న పేదలకు చూపును ప్రసాదించడంలో దక్కిన ఆనందం మాటల్లో చెప్పలేనిది. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేదలు ఆర్థిక స్థోమత లేక, కంటి సమస్యలను భరిస్తూ తీవ్ర వేదన అనుభవించేవారు. అలాంటి వారి బాధను గుర్తించి రేకుర్తి కంటి ఆసుపత్రి సహకారంతో ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఆపరేషన్ అనంతరం కట్టు విప్పి, తిరిగి ఈ ప్రపంచాన్ని చూస్తూ ఆ వృద్ధులు ఆనందంతో చేతులెత్తి మొక్కుతుంటే కలిగిన తృప్తి వెలకట్టలేనిది.వారి కళ్లల్లో నిండిన సంతోషమే లయన్స్ క్లబ్ సేవా ప్రస్థానానికి అసలైన బలం. భవిష్యత్తులోనూ సమాజంలో అవసరార్థులకు అండగా ఉంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తాం అని పేర్కొన్నారు. దేవుడు కళ్లు ఇస్తే.లయన్స్ క్లబ్ వారు చూపునిచ్చారు! “వయసు పెరిగేకొద్దీ చూపు తగ్గిపోయి పక్కవారి సహాయం లేకుండా అడుగు తీసి అడుగు వేయలేకపోయాను. వేలకు వేలు పోసి ప్రైవేటులో ఆపరేషన్ చేయించుకునే స్తోమత మాకు లేదు. అలాంటి సమయంలో లయన్స్ క్లబ్ వారు దేవుడిలా వచ్చి ఉచితంగా పరీక్షలు చేసి, ఆసుపత్రికి తీసుకెళ్లి ఆపరేషన్ చేయించారు. మళ్లీ మాకు ఈ ప్రపంచాన్ని చూసే భాగ్యం కల్పించారు. జీవితాంతం లయన్స్ క్లబ్‌కు రుణపడి ఉంటాం” అంటూ లబ్ధిదారులు ఆనంద బాష్పాలతో కృతజ్ఞతలు తెలిపారు. సేవా యజ్ఞంలో భాగస్వాములు: ఈ మానవీయ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఫాస్ట్ ప్రెసిడెంట్ ముసుకు కరుణాకర్ రెడ్డి,కోశాధికారి సట్ట సురేష్, ప్రోగ్రామింగ్ చైర్మన్, ఉప సర్పంచ్ గురిజాల బుచ్చి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి జెల్ల అనిల్, పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు చౌటపల్లి తిరుపతి, అనిల్ కుమార్, రాజేశం, రేకుర్తి కంటి ఆసుపత్రి టెక్నీషియన్ చింతల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.39 మంది నిరుపేదల జీవితాల్లో ఉచితంగా వెలుగులు నింపిన లయన్స్ క్లబ్ ఉదారతపై మండల వ్యాప్తంగా ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.