
సాక్షి డిజిటల్ న్యూస్ 3 సెప్టెంబర్ 26 అనంతగిరి మండల రిపోర్టర్ గరిడేపల్లి రమేష్ ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, అన్ని రంగాల్లో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజాక్షేత్రంలో పోరాటం ఉధృతం చేస్తామని కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) పిలుపు మేరకు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలను గాలికొదిలేసిన తీరును ఎండగడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైన తీరును ప్రజలకు తెలియజేసేందుకు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు కోదాడ నియోజకవర్గ స్థాయి ధర్నా కార్యక్రమం మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో కోదాడ నియోజకవర్గ కేంద్రమైన కోదాడ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో గల మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ ఇచ్చిన అపరిష్కృత హామీలతో కూడిన ” బాకీ కార్డుల “ను ప్రజలకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారంలోకి రావడం కోసమే కాంగ్రెస్ పార్టీ నకిలీ గ్యారెంటీ కార్డులు ఇచ్చి, వాటిని ఇంట్లో బీరువాల్లో భద్రంగా దాచుకోమని ప్రచారం చేసిందని మండిపడ్డారు. నేడు ఆ కార్డులు తుప్పుపట్టి, చెదలు పట్టిపోతున్నాయే తప్ప అందులోని హామీలు అమలయ్యే దాఖలాలు లేవని, వాటి గురించి ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చేపట్టిన పనులకు సంబంధించిన కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుల్లో తీవ్రమైన అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు. 20 శాతం కమీషన్లు ముట్టజెబితే తప్ప బిల్లులు విడుదల చేయని దుస్థితి నెలకొనడంతో కాంట్రాక్టర్లు రోడ్లెక్కి ఆందోళనలు చేసే పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్నదాతలను నిలువునా మోసం చేస్తూ వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టారని విమర్శించారు. మరోవైపు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న రాజధాని హైదరాబాద్‌లో భూకబ్జాలు, అవినీతి దందాలు చేస్తూ రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేశారని మండిపడ్డారు.అబద్ధపు ప్రచారాలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ వెంటనే ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం సెప్టెంబర్ 2 నుంచి 9వ తేదీ వరకు ఏడు రోజుల పాటు నియోజకవర్గంలోని గ్రామగ్రామాన నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని, ప్రజా సమస్యలపై గులాబీ జెండా నిరంతరం పోరాడుతుందని తేల్చిచెప్పారు.