
సాక్షి డిజిటల్ న్యూస్ : సెప్టెంబర్ 3 (జర్నలిస్ట్ : షేక్ మక్బూల్ బాష). యర్రగొండపాలెం: యర్రగొండపాలెం సేవా సమితి మాజీ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ప్రదాత స్వర్గీయ “వేగినాటి కోటయ్య” 37వ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, ప్రకాశం జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ “డాక్టర్ మన్నే రవీంద్ర” ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ మన్నే రవీంద్ర మాట్లాడుతూ, యర్రగొండపాలెం ప్రాంత అభివృద్ధి, ప్రజా సంక్షేమం, సేవా కార్యక్రమాలే లక్ష్యంగా తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి వేగినటి కోటయ్య అని కొనియాడారు. ప్రజా సమస్యల పట్ల నిరంతరం స్పందిస్తూ, తనకు సాధ్యమైనంత మేరకు ప్రజలకు అండగా నిలిచిన ఆయన సేవలు యర్రగొండపాలెం ప్రాంత ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. సామాజిక సేవతో పాటు తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి వేగినాటి కోటయ్య చేసిన కృషి స్ఫూర్తిదాయకమని డాక్టర్ మన్నే రవీంద్ర పేర్కొన్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేయడం ఆయన ప్రత్యేకత అని తెలిపారు.
వేగినాటి కోటయ్యతో కలిసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజాసేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం తనకు లభించడం ఎంతో ఆనందంగా, గర్వంగా భావిస్తున్నానని డాక్టర్ మన్నే రవీంద్ర అన్నారు. ఆయనతో గడిపిన సమయం, ప్రజా సేవలో ఆయన చూపిన అంకితభావం, సమాజం పట్ల ఆయనకున్న బాధ్యత తనకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తాయని చెప్పారు. వేగినాటి కోటయ్య భౌతికంగా దూరమైనప్పటికీ, ప్రజాసేవ ద్వారా ఆయన అందించిన స్ఫూర్తి, ఆయన చేసిన సేవలు, ప్రజల పట్ల చూపిన అభిమానం ఎప్పటికీ మరువలేనివని డాక్టర్ మన్నే రవీంద్ర పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సంక్షేమం, ప్రాంత అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని అన్నారు.