ప్రజాపాలన కాదు ప్రజావంచన!

ఆరు గ్యారంటీలు, 420 హామీల వైఫల్యాలపై జగిత్యాలలో బీఆర్ఎస్ '420 అడుగుల భారీ ఫ్లెక్సీ' నిరసన ర్యాలీ
🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్ జగిత్యాల నియోజకవర్గం ఇన్చార్జి కొడిపెల్లి సురేష్/ జగిత్యాల, సెప్టెంబర్ 3: రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతో ప్రజావంచన పాలన సాగుతోందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలులో విఫలమైందని విమర్శిస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలో బుధవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. జగిత్యాల పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జగిత్యాల జిల్లా పరిషత్ తొలి ఛైర్‌పర్సన్ దావా వసంత సురేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొత్త బస్టాండ్‌లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నుంచి పాత బస్టాండ్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ జెండాలు, ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించిన ఫ్లకార్డులు చేతబట్టి నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మెడలో గులాబీ కండువాలు ధరించి, పార్టీ జెండాలు చేతబట్టి భారీ సంఖ్యలో కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళలు, కార్యకర్తలతో జగిత్యాల పట్టణం గులాబీమయంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను గుర్తు చేస్తూ 420 అడుగుల భారీ ఫ్లెక్సీని ప్రదర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బాకీ కార్డులను పంపిణీ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ర్యాలీ పొడవునా నినాదాలు చేశారు. అనంతరం స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట నిర్వహించిన సమావేశంలో తాటిపర్తి జీవన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వెయ్యి రోజులు గడిచినా హామీల అమలు లేదని ఆరోపణ గత దశాబ్ద కాలంలో దేశానికి ఆదర్శంగా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కేసీఆర్ అమలు చేశారని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు గడుస్తున్నా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతో ప్రజావంచన పాలన సాగుతోందని విమర్శించారు. కేసీఆర్ పాలనలో రైతు మరణిస్తే రైతు బీమా కింద రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించామని, రైతులకు వివిధ సంక్షేమ పథకాలు అమలు చేశామని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో విద్యుత్ సరఫరాపై ప్రజల్లో ఆందోళన నెలకొందని, రసాయనిక ఎరువులపై ఆంక్షల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. గొల్లకురుమల కులవృత్తులను ప్రోత్సహించేందుకు కేసీఆర్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ చేపట్టిందని, మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ చేసిందని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో చేప పిల్లల పంపిణీ సకాలంలో జరగడం లేదని ఆరోపించారు. బెల్ట్ షాపుల సంఖ్య పెరిగిందని, మద్యం ద్వారా ప్రభుత్వ ఆదాయం భారీగా పెరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పెన్షన్లు మంజూరు చేయడంలో విఫలమైందని, అనేక పెన్షన్లను తొలగించిందని విమర్శించారు. చేయూత పెన్షన్‌ను రూ.4 వేలుకు పెంచుతామని హామీ ఇచ్చి అమలు చేయలేదని, మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి ఇవ్వడం లేదని ఆరోపించారు. నిరుపేద వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేలు, ఆటో కార్మికులకు నెలకు రూ.వెయ్యి ఆర్థిక సాయం అందిస్తామని ఇచ్చిన హామీలు అమలు కాలేదని విమర్శించారు. విద్య, ఉపాధి రంగాలపై విమర్శలు స్వయం ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తులు స్వీకరించినప్పటికీ లబ్ధిదారులకు సహాయం అందలేదని జీవన్‌రెడ్డి ఆరోపించారు. బీసీ సబ్‌ప్లాన్‌కు ఏటా రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి తగిన నిధులు ఇవ్వలేదని విమర్శించారు. ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం పటిష్టంగా అమలు చేసిందని పేర్కొన్నారు. బీసీ జనాభా గణాంకాల విషయంలో కూడా ప్రభుత్వంపై ప్రశ్నలు లేవనెత్తారు. గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే గణాంకాలు, ప్రస్తుత కులగణన గణాంకాల మధ్య వ్యత్యాసం ఉందని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ నాయకుడు కేటీఆర్ సూచనల మేరకు 420 అడుగుల ఫ్లెక్సీతో ఈ నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, ఎన్నికల హామీలు అమలు అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని అన్నారు. ఉద్యమాల గడ్డ జగిత్యాల నుంచే పోరాటానికి శ్రీకారం ఉద్యమాల గడ్డ అయిన జగిత్యాల నుంచే ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటానికి శ్రీకారం చుట్టామని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ మళ్లీ రావాలని, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వెళ్లాలని నినదిస్తూ పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం: విద్యాసాగర్‌రావు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు భారీ నిరసన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. కేసీఆర్ పాలనలో అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు ప్రస్తుతం కనుమరుగవుతున్నాయని ఆరోపించారు. పుట్టిన పిల్లలకు ఆర్థిక సహాయంతో పాటు కేసీఆర్ కిట్ అందించామని, ఆ పథకాన్ని కొనసాగించాలని సూచించారు. నిరుద్యోగులకు భృతి ఇస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం మరిచిపోయిందని విమర్శించారు. తెలంగాణ కోసం అందరూ పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నామని, కేసీఆర్ పాలనలో గొర్రెలు, ఉచిత చేప పిల్లల పంపిణీతో పాటు పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై వారం రోజుల పాటు జరిగే నిరసన కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని విద్యాసాగర్‌రావు కోరారు. 100 రోజులు కాదు.. వెయ్యి రోజులు గడిచినా హామీలు అమలు కాలేదు: దావా వసంత సురేష్ జగిత్యాల జిల్లా పరిషత్ తొలి ఛైర్‌పర్సన్ దావా వసంత సురేష్ మాట్లాడుతూ వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, అయితే వెయ్యి రోజులు గడుస్తున్నా అనేక హామీలు అమలుకు నోచుకోలేదని ఆరోపించారు. రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలులో క్వింటాలుకు బోనస్ ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయలేదని ఆరోపించారు. విద్యా భరోసా కింద రూ.5 లక్షల వరకు సాయం చేస్తామని చెప్పి అమలు చేయలేదని, ఆటో కార్మికులకు ఆర్థిక భరోసా, మహిళలకు నెలకు రూ.2,500, పెన్షన్లను రూ.4 వేలుకు పెంపు వంటి హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. కళ్యాణలక్ష్మి పథకానికి అదనంగా తులం బంగారం ఇస్తామని చెప్పిన హామీ కూడా అమలు కాలేదని ఆరోపించారు. కేసీఆర్‌ను విమర్శించడమే కాకుండా ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. పేదలకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని దావా వసంత సురేష్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *