సాక్షి డిజిటల్ న్యూస్ సెప్టెంబర్ 3 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి జి శ్రీనివాసరావు ముమ్మిడివరం
ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వ అధికారి హోదాలో ఉంటూ నిబంధనలకు విరుద్ధంగా ఒక రాజకీయ పార్టీ నాయకుడిలా వ్యవహరించిన ముమ్మిడివరం మున్సిపల్ కమిషనర్ పి.రవివర్మను సస్పెండ్ చేయాలని వైస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి కాశి రామకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా స్థానిక శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మంటపంలో రాజకీయ నాయకులు నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి. రవివర్మ “ఒజి” గెటప్‌లో పాల్గొని కేక్ కటింగ్ వేడుకల్లో పాల్గొనడం సివిల్ సర్వీస్ ప్రవర్తనా నియమావళికి పూర్తి విరుద్ధమని రామకృష్ణ పేర్కొన్నారు ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రజాసేవ చేయాల్సిన అధికారి నిష్పాక్షికతను వదిలేసి, ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలా డ్రెస్ కోడ్ ధరించి ప్రత్యక్షంగా పాల్గొనడం అత్యంత శోచనీమని, సర్వీస్ రూల్స్‌ను ఉల్లంఘించి ఒక రాజకీయ పార్టీ నేతగా వ్యవహరించిన మున్సిపల్ కమిషనర్ రవివర్మపై తక్షణమే సస్పెన్షన్ వేటు వేయాలని వైస్సార్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారులు ఈ ఘటనపై వెంటనే స్పందించి సమగ్ర విచారణకు ఆదేశించాలని ప్రభుత్వ అధికారులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడాన్ని కూటమి ప్రభుత్వం తక్షణమే స్వస్తి చెప్పాలని నిబంధనలు దాటి ప్రవర్తించిన కమిషనర్‌పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు.