
సాక్షి డిజిటల్ న్యూస్ హొళగుంద సెప్టెంబర్ 3 దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతి వేడుకలను హొళగుంద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం. అమానుల్లా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు పాల్గొని వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ఎం. అమానుల్లా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక విప్లవాత్మక పథకాలను అమలు చేశారని గుర్తుచేశారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ, రైతులకు అండగా రైతు రుణమాఫీ, వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా ఉచిత విద్యుత్ వంటి కీలక పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. వైఎస్సార్ పాలనలో రైతులు, పేదలు, సామాన్య ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందాయని, ఆయన సేవలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని అమానుల్లా పేర్కొన్నారు. వైఎస్సార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొని వైఎస్సార్‌కు ఘన నివాళులర్పించారు.