అరకు నేరేడు వలస స్కూల్ స్థలం వ్యవహారంపై నిగ్గు తేల్చాలి

🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ ఎస్ సంజీవ్ అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గ డుంబ్రిగూడ మండల కేంద్రంలోని అరుకు నేరేడువలస గవర్నమెంట్ స్కూల్ స్థలం కబ్జాపై 1/70 చట్టాన్ని కాపాడాల్సిన రెవిన్యూ అధికారుల నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ జరపాలి: సుజాత సల్మాన్ గిరిజన ప్రాంతాల్లో గిరిజనుల భూమి హక్కులను, ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన రెవిన్యూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తే 1/70 చట్టం ఉద్దేశమే దెబ్బతింటుందని సామాజిక కార్యకర్త, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు సుజాత సల్మాన్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరేడువలసపాఠశాలకు సంబంధించిన స్థలం విషయంలో వాస్తవాలు ఏమిటో రెవిన్యూ అధికారులు వెంటనే నిగ్గు తేల్చి ప్రజల ముందు పూర్తి వివరాలు వెల్లడించాలని ఆమె డిమాండ్ చేశారు. పాఠశాల స్థలం ప్రభుత్వ ఆస్తి అయితే దాని రికార్డులు, హద్దులు, స్వామ్య హక్కులు, గతంలో జరిగిన లావాదేవీలు తదితర అంశాలపై పారదర్శకంగా విచారణ జరపాలని కోరారు. గిరిజన ప్రాంతాల్లో 1/70 చట్టం అమలును పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తే, చివరకు ప్రభుత్వ పాఠశాలల స్థలాలు కూడా వివాదాల్లో చిక్కుకునే పరిస్థితి ఏర్పడుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. చిల్లర ప్రయోజనాల కోసం కొందరు వ్యక్తులు ప్రభుత్వ స్థలాలు, గిరిజనుల హక్కులకు సంబంధించిన భూముల విషయంలో బినామీ వ్యవహారాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అవి నిజమా కాదా రెవిన్యూ అధికారులు ప్రజలకు స్పష్టంగా చెప్పాలి. ఆరోపణలు నిజమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. నిజం కాకపోతే అధికారిక రికార్డులతో ప్రజలకు స్పష్టత ఇవ్వాలిఅని సుజాత సల్మాన్ అన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు తమ స్థాయిలో సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, రెవిన్యూ శాఖ నుంచి స్పష్టమైన చర్యలు లేకపోతే వారి ప్రయత్నాలు ప్రయోజనం లేకుండా పోతున్నాయని ఆమె పేర్కొన్నారు. నేరేడు వలస పాఠశాల స్థలంపై సమగ్ర విచారణ చేపట్టాలి. పాఠశాల స్థలానికి సంబంధించిన అన్ని రెవిన్యూ రికార్డులు, హద్దులు, పట్టా ప్రభుత్వ భూమి వివరాలను బహిర్గతం చేయాలి. ప్రభుత్వ ఆస్తిపై అక్రమ ఆక్రమణలు లేదా బినామీ లావాదేవీలు ఉన్నాయా అనే అంశంపై నిష్పక్షపాత విచారణజరపాలి.గిరిజన ప్రాంతాల్లో 1/70 చట్టం పటిష్టంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలి.
ప్రభుత్వ పాఠశాల స్థలాలను పూర్తిగా రక్షించాలి. పాఠశాల విద్యకు సంబంధించిన భూముల విషయంలో భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు తావులేకుండా సర్వే చేసి హద్దులు నిర్ణయించాలి. బాధ్యులుగా ఎవరైనా తేలితే వారి హోదా, రాజకీయ సంబంధాలతో సంబంధం లేకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
గిరిజనుల హక్కులు, పిల్లల విద్య, ప్రభుత్వ ఆస్తుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. నేరేడు వలస స్కూల్ స్థలం వ్యవహారంలో అసలు నిజం బయటకు వచ్చే వరకు ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాం. అధికారులు మౌనం వీడి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలి. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ ఆస్తిని కాపాడాలిఅని సుజాత సల్మాన్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *