వైఎస్ఆర్ పాలనను ప్రతిపక్షాలు సైతం మెచ్చుకున్నాయి

🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్: పెద్దపల్లి జిల్లా స్టాపర్ కొమ్మురాజ్ రాజ్ కుమార్ 03-09-2026 ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం ద్వారా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నేత వైఎస్ఆర్: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గోదావరిఖని: దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎన్ ఎస్ యు ఐ నాయకుడు మెంటం ఉదయ్ రాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ గారు హాజరై వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పాలన ప్రజల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సాగిందన్నారు. ఆయన పరిపాలనను ప్రతిపక్ష నాయకులు సైతం మెచ్చుకునే స్థాయిలో వైఎస్ఆర్ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత వైఎస్ఆర్‌కే దక్కుతుందని, ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా ఎంతోమంది పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను అందుకునే అవకాశం కల్పించారని తెలిపారు. అలాగే జలయజ్ఞం ద్వారా సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిస్తూ రైతుల పొలాలకు నీరు అందించేందుకు కృషి చేసిన రైతు పక్షపాతి వైఎస్ఆర్ అని కొనియాడారు.
వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఆయన తీసుకున్న ప్రజా అనుకూల నిర్ణయాలు నేటికీ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. పేదలు, రైతులు, విద్యార్థుల జీవితాల్లో మార్పు తీసుకురావడమే వైఎస్ఆర్ పాలన లక్ష్యంగా ఉండేదని పేర్కొన్నారు.
రామగుండం పట్టణంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఒక ఖాళీ స్థలాన్ని చూపించాలని నగర మేయర్ మహంకాళి స్వామి గారిని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కోరారు. వైఎస్ఆర్ జ్ఞాపకార్థం రామగుండంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్, కార్పొరేటర్లు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *