శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం…నేరాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు

*ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో ఆగస్టు నెల పోలీస్‌ గణాంకాలు విడుదల.
🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్ : సెప్టెంబర్ 3 (జర్నలిస్ట్ : షేక్ మక్బూల్ బాష). ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, నేరాల నియంత్రణతో పాటు చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని జిల్లా ఎస్పీ “వి.హర్షవర్ధన్ రాజు” ఐపీఎస్ తెలిపారు. ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు జిల్లాల్లో పోలీసులు నిర్వహించిన తనిఖీలు, దాడులు, అవగాహన కార్యక్రమాలు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలకు సంబంధించిన నెలవారీ గణాంకాలను ఆయన వెల్లడించారు. జూద కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు కోడిపందాలు, పేకాట తదితర వాటిపై విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 37 కేసులు నమోదు చేసి 200 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి
రూ.7,24,750 నగదు, 7 కోళ్లు, 19 మోటార్ సైకిళ్లు, 42 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో చెడునడతగల వ్యక్తులు, రౌడీషీటర్లపై కూడా పోలీసులు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. 814 మందికి కౌన్సెలింగ్ నిర్వహించి, సత్ప్రవర్తనతో సమాజంలో కలిసిమెలిసి జీవించాలని సూచించారు. తమ వ్యవహారశైలిని మార్చుకోకుండా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, చట్టాన్ని అతిక్రమించి దౌర్జన్యాలకు పాల్పడినా కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు 926 కేసులు నమోదు చేయడంతో పాటు, ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్న 935 ప్రదేశాలను శుభ్రపరిచారు. రోడ్లను ఆక్రమించి ప్రజలకు, వాహనదారులకు ట్రాఫిక్‌ ఇబ్బందులు కలిగిస్తున్న వారిపై టౌన్‌ న్యూసెన్స్‌ యాక్ట్‌ కింద 143 కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆయా కేసుల్లో కోర్టులు జరిమానాలు, శిక్షలు విధించాయి.
మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కూడా పోలీసులు దృష్టి సారించారు. గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి ఒక కేసు నమోదు చేసి సుమారు 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు మోటారు వాహన చట్టం కింద విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలపై 8,539 ఈ-చలానా కేసులు నమోదు చేసి రూ.42,82,910 జరిమానా విధించారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల్లో 366 మంది వాహనదారులను పట్టుకుని కోర్టులలో హాజరుపరచగా, రూ.12 లక్షల జరిమానా విధించారు. వీరిలో ఇద్దరికి కోర్టు జైలు శిక్ష విధించింది. జిల్లా వ్యాప్తంగా పగలు, రాత్రి నిరంతర గస్తీ నిర్వహిస్తూ పాత నేరస్తుల కదలికలపై నిఘా కొనసాగిస్తున్నారు. అనుమానితులను విచారించడంతో పాటు అవసరమైన సందర్భాల్లో బైండ్‌ ఓవర్‌ చేయడం, కౌన్సెలింగ్‌ నిర్వహించడం వంటి చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు తమ పరిధిలోని గ్రామాలు, వార్డులను సందర్శిస్తూ ప్రజలతో ముఖాముఖి మాట్లాడుతున్నారు. దొంగతనాలను నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సీసీ కెమెరాల ప్రాధాన్యత, మహిళలకు సంబంధించిన చట్టాలు, గంజాయి, మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, వాటికి సంబంధించిన చట్టపరమైన శిక్షలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సైబర్‌ నేరాలు, లోన్‌ యాప్స్‌ మోసాలు, క్రికెట్‌ బెట్టింగ్‌, రహదారి భద్రతా నియమాలు, హెల్మెట్‌ వినియోగం, కొత్త క్రిమినల్‌ చట్టాలపై కూడా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చట్టాన్ని అతిక్రమించి ప్రజల శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ “వి.హర్షవర్ధన్ రాజు” స్పష్టం చేశారు. ప్రజలు కూడా చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించి శాంతిభద్రతల పరిరక్షణలో సహకరించాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *