
సాక్షి డిజిటల్ న్యూస్ సెప్టెంబర్ 3 షాద్నగర్ఇంచార్జ్ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి శత్రువులు సైతం అభినందించే గొప్ప నాయకుడని షాద్‌నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా బుధవారం షాద్‌నగర్ పట్టణంలోని ఫరూక్నగర్ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వర్ధంతి సభకు నియోజకవర్గంలోని వివిధ మండలాలు, గ్రామాల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. “రాజశేఖర్‌రెడ్డి అంటే సంక్షేమం.. సంక్షేమం అంటే రాజశేఖర్‌రెడ్డి” అని అన్నారు. 2004 నుంచి 2009 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్ తదితర సంక్షేమ పథకాలను అమలు చేసి పేదలు, రైతుల జీవితాల్లో మార్పు తీసుకువచ్చారని తెలిపారు. 2009 సెప్టెంబర్ 2న నల్లమల అటవీ ప్రాంతంలోని పావురాలగుట్ట వద్ద జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మృతి చెందినా, ప్రజా సేవల ద్వారా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలుగు ప్రజల గుండెల్లో వైఎస్సార్‌కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. పేదల కోసం అమలు చేసిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలు ఆయన సంక్షేమ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. “సంక్షేమానికి సంతకం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి” అని కొనియాడారు. వైఎస్సార్ విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన స్థానిక నేత ఇబ్రహీంను ప్రతాప్‌రెడ్డి అభినందించారు. అనంతరం సమీపంలోని బాలికల పాఠశాలలో ఆయన ఆధ్వర్యంలో విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు మామిడి శ్యామ్‌సుందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు బస్వాం, వైస్ చైర్మన్ అందే మోహన్, మార్కెట్ కమిటీ చైర్మన్ సులోచన కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, కాంగ్రెస్ గిరిజన విభాగం కోఆర్డినేటర్ రఘునాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజుగౌడ్, కొత్తూరు మాజీ ఎంపీపీ శివశంకర్‌గౌడ్, సింగిల్ విండో చైర్మన్లు, వివిధ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, కౌన్సిలర్లు, సర్పంచులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు.