దొంగతనం కేసులో నిందితుడికి 8 నెలల జైలు శిక్ష

*రూ.1,000 జరిమానా విధించిన మార్కాపురం అదనపు జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్.
🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్ : సెప్టెంబర్ 3 (జర్నలిస్ట్ : షేక్ మక్బూల్ బాష). మార్కాపురం : దొంగతనం కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడికి 8 నెలల జైలు శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధిస్తూ మార్కాపురం అదనపు జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ “ఎం.బాలాజీ” మంగళవారం (సెప్టెంబర్ 1, 2026) తీర్పు వెలువరించారు. మార్కాపురం పట్టణానికి చెందిన మండ్ల శ్రీనివాసులు (54) టీ స్టాల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. 2025 ఏప్రిల్ 4న ఉదయం సుమారు 5 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆయన ఇంటి ఉత్తరం వైపు ఉన్న తలుపు రెక్కలను తొలగించి ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం ఇంట్లో ఉన్న రూ.30,000 నగదుతో పాటు సుమారు 6 గ్రాముల బరువున్న ఒక జత బంగారు కమ్మలు, సుమారు రూ.18,000 విలువైన ఆభరణాలను అపహరించారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న మార్కాపురం ఎస్సై ఎం.రాజా మోహన్ రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నిందితుడిగా గుర్తించిన గుడిపాటి వీరాంజి అలియాస్ వీరాంజనేయులు (30), పెద్దకంచర్ల గ్రామం, వినుకొండ మండలం, మరో కేసులో ఒంగోలు తాలూకా పోలీసులకు పట్టుబడగా, ఈ కేసులోనూ అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం దర్యాప్తు పూర్తి చేసి నిందితుడిపై కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. కేసు విచారణలో భాగంగా పోలీసులు సంబంధిత సాక్షులను కోర్టులో హాజరుపరిచి, నిందితుడిపై నేరం రుజువు చేసే ఆధారాలను సమర్పించారు. ప్రాసిక్యూషన్ తరఫున సీనియర్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ లక్ష్మి నాయక్ వాదనలు వినిపించారు. జిల్లా ఎస్పీ “వి.హర్షవర్ధన్ రాజు” ఐపీఎస్ మార్గదర్శకత్వంలో ప్రత్యేక మానిటరింగ్ టీం కేసు ట్రయల్‌ను సమర్థవంతంగా పర్యవేక్షించింది. ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన అనంతరం నిందితుడిపై నేరం రుజువైనట్లు నిర్ధారించిన న్యాయస్థానం 2026 సెప్టెంబర్ 1న నిందితుడు గుడిపాటి వీరాంజి అలియాస్ వీరాంజనేయులుకు 8 నెలల జైలు శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించింది. కేసులో నిందితుడికి శిక్ష పడేలా సమర్థవంతంగా దర్యాప్తు చేసి, సాక్ష్యాధారాలను సేకరించి, విచారణను పర్యవేక్షించిన మార్కాపురం పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ “వి.హర్షవర్ధన్ రాజు” ఐపీఎస్ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *