
సాక్షి డిజిటల్ న్యూస్ వర్ని, సెప్టెంబర్ 3(ప్రతినిధి రాహుల్): నిజామాబాద్ జిల్లా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా వర్ని మండలం ఎస్‌ఎన్‌పురం గ్రామానికి చెందిన యువకులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థించారు. అనంతరం చింతకుంటలోని స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అనాథ వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. అక్కడ నివసిస్తున్న వృద్ధుల యోగక్షేమాలను అడిగి తెలుసుకుని, వారికి నెల రోజుల పాటు సరిపడే కిరాణా సామగ్రి, నిత్యావసర వస్తువులను అందజేశారు. పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా, అవసరమైన వారికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు అభిమానులు తెలిపారు. పవన్ కళ్యాణ్ ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వర్ని మండల పవన్ కళ్యాణ్ అభిమానుల తరఫున ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో కూడా పేదలు, వృద్ధులు, అవసరమైన వారికి అండగా నిలుస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.