నీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలి.

ఖాళీ బిందెలతో మహిళల నిరసన గ్రామసభ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో బైఠాయింపు.
🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్ సెప్టెంబర్ 3 మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం (రిపోర్టర్ వల్లపుదాసు వెంకటేశ్వర్లు) గార్ల పట్టణ ప్రజలు గత పది రోజులుగా తీవ్రంగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహిళలు ఖాళీ బిందెలతో సీపీఎం ఆధ్వర్యంలో నిరసనగా పట్టణంలోని నెహ్రూ సెంటర్ నుంచి ఖాళీ బిందెలతో మహిళలు, ప్రజలు ప్రదర్శనగా బయలుదేరి పంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న రెవెన్యూ గ్రామసభకు చేరుకున్నారు. అనంతరం గ్రామసభ వద్ద సీపీఎం నాయకులు, మహిళలు బైఠాయించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్, మండల కార్యదర్శి అలవాల సత్యవతి మాట్లాడుతూ గార్ల పట్టణ ప్రజలు గత వారం రోజులుగా తీవ్ర తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ పంచాయతీ పాలకవర్గం, అధికారులు సమస్య పరిష్కారంపై తగినంత దృష్టి సారించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గత పది రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో మహిళలు, వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పట్టణ ప్రజలకు తాగునీరు అందించడంలో కీలకమైన స్థానిక ఫిల్టర్ బెడ్‌కు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి, నీటి సరఫరాను పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ నీటి సరఫరా పునరుద్ధరించే వరకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ట్యాంకర్లతోనైనా, ఇతర అందుబాటులో ఉన్న వనరుల ద్వారానైనా పట్టణ ప్రజలకు తాగునీటిని అందించాలని కోరారు. ప్రజలకు కనీస అవసరమైన తాగునీటిని అందించడంలో అధికారులు నిర్లక్ష్యం చేయడం సరికాదని, సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే ప్రజలను సమీకరించి మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు. ఆందోళన నేపథ్యంలో గార్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ పార్వతి హతిరామ్ నాయక్ స్పందిస్తూ మిషన్ భగీరథ పైప్‌లైన్ మరమ్మతుల కారణంగా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడిందని తెలిపారు. పట్టణ ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు, సీపీఎం నాయకులు ఆందోళనను విరమించారు.ఈ ఆందోళనకు న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి జి. సక్రు, ఐద్వా మండల కార్యదర్శి ఎం. నాగమణి, వార్డు సభ్యులు పూర్ణచందర్, టీజేఎస్ రాష్ట్ర నాయకులు జి. మురళి తారక్, సీపీఎం, ఎన్‌డీ నాయకులు టీ. నాగేశ్వరావు, మాన్య తదితరులు మద్దతు తెలిపి ఆందోళనలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో కల్పన, దుర్గ, స్వరూప, సుగుణ, మంగమ్మ, రమాదేవి, వెంకటలక్ష్మి, నవ్య, బేగం, సునీత, సుజాత, అనితతో పాటు పలువురు మహిళలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *