సాక్షి డిజిటల్: బోధన్, (సెప్టెంబర్ 3): నిజామాబాద్ జిల్లా: ప్రతినిధి రాహుల్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్నప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ అమీర్ ఆరోపించారు. బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా షకీల్ అమీర్ మాట్లాడుతూ, ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. తెలంగాణ ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామని గ్యారంటీ కార్డుల్లో హామీ ఇచ్చారని, అయితే ఇప్పటివరకు ఆ హామీ అమలు కాలేదని అన్నారు. మహిళలకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు అవినీతి, అక్రమాల ఆరోపణలు చేస్తూ, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ధర్నా సందర్భంగా కార్యకర్తలు “దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ” అంటూ నినాదాలు చేయడంతో అంబేద్కర్ చౌరస్తా మారుమోగింది. ధర్నా కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్, మండల నాయకులు సంజీవ్, శ్రీరామ్, నర్సింగ్ రావు, అబ్బన్న, భూమారెడ్డి, పట్టణ కౌన్సిలర్లు అశోక్ రెడ్డి, ముషీర్ భాయ్, మోబిన్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.