క్లోరోక్విన్ బాధితులకు ఎమ్మెల్యే భరోసా వైద్య సేవల్లో నిర్లక్ష్యం సహించేది లేదన్న మిరియాల శిరీషాదేవి

🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్‌. దేవీపట్నం,ఎటపాక, సెప్టెంబర్‌ 3: కె ప్రకాశరావు. క్లోరోక్విన్ మాత్రలు సేవించి అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఎటపాక మండలం విస్సాపురం పంచాయతీ గుల్లగుప్ప గ్రామంలో ఆమె ఆకస్మికంగా పర్యటించి పరిస్థితులను సమీక్షించారు. గ్రామంలో క్లోరోక్విన్ మాత్రలు వేసుకున్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. 40 మంది పెద్దలు, 30 మంది చిన్నారులకు మాత్రలు వేసినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. అనంతరం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్యే పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల మలేరియాతో మృతి చెందిన విద్యార్థిని మడవి జమున (7) కుటుంబాన్ని ఆదుకుంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ విషయంపై కలెక్టర్‌తో మాట్లాడి కుటుంబానికి అవసరమైన సహాయం అందించాలని సూచించారు. గుల్లగుప్పలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని, పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, గ్రామంలో ఎప్పటికప్పుడు బ్లీచింగ్‌ చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. ప్రజలు కాచి చల్లార్చిన నీటిని తాగాలని, అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిస్తూ వారికి భరోసా కల్పించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *