
సాక్షి డిజిటల్ న్యూస్ ,వేంపల్లి,సెప్టెంబర్ :03(పులివెందుల తాలూకా రిపోర్టర్ గోసల అంజనేయులు) ఉత్తరాంధ్రకు సాగునీరు, త్రాగు నీరు, పారిశ్రామిక నీరు అందించే పోలవరం ఎడమ కాలువకు బుధవారం ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేయడం హర్షనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నరెడ్డి తులసి రెడ్డి అన్నారు. బుధవారం వేంపల్లిలో తులసి రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు ప్రకృతి ఆంధ్రప్రదేశ్ కు ప్రసాదించిన వరమని, ఈ ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక అని అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏడు లక్షల ఇరవై వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు, పది లక్షల పదమూడు వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని,540 గ్రామాలలో 28.5 0 లక్షల మందికి త్రాగునీరు అందుతుందని, విశాఖపట్నం కి తాగునీరు,విశాఖ ఉక్కు కర్మగారానికి కావలసిన పారిశ్రామిక నీరు తో పాటు 960 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నారు.ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో 1942లో 200 అడుగుల ఎత్తున పోలవరం ప్రాజెక్టు నిర్మించాలని ప్రతిపాదన రాగా, ఆ ఎత్తులో నిర్మిస్తే భద్రాచలం గుడి మునుగుతుందన్న కారణం తో 1980 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీని ఎత్తును 150 అడుగులకు తగ్గించడం జరిగింది.2004 జూలైలో కాంగ్రెస్ పాలనలో ఈ ప్రాజెక్టుకు పరిపాలన మంజూరు చేయడం జరిగింది.2004 – 2014 మధ్య రాష్ట్ర బడ్జెట్ నుండి కాంగ్రెస్ పాలనలో రూ 5136 కోట్లు ఖర్చు చేయడం జరిగింది.మొత్తం ప్రాజెక్టులో 32 శాతం పనులు కాంగ్రెస్ పాలనలో జరిగాయి. కాంగ్రెస్ పాలనలో 90 శాతం అనుమతులు వచ్చాయి.కుడి కాలువ పనులు 80 శాతం, ఎడమ కాలువ పనులు 45 శాతం జరిగాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోయినప్పటికీ కుడి కాలువ పనులు పూర్తయ్యాయి.పోలవరం జలాశయం నుండి గ్రావిటీ ద్వారా గోదావరి జలాలు కుడి ఎడమ కాలువల ద్వారా ప్రవహించినప్పుడే పోలవరం ప్రాజెక్టు పూర్తయినట్టు లెక్క. ప్రస్తుతానికి పురుషోత్తపట్నం,పుష్కర ఎత్తిపోతల పథకాల ద్వారా మాత్రమే గోదావరి జలాలను ఎడమ కాలువలోకి పంపడం జరుగుతుంది. పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించి పోలవరం ప్రాజెక్టు ఎత్తును 150 అడుగుల మేర నిర్మించి గ్రావిటీ ద్వారా ఎడమ కాలువలోకి గోదావరి జలాలు పంపించేటందుకు కృషి చేయాలని తులసి రెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.