సాక్షి డిజిటల్ న్యూస్, అశ్వారావుపేట, రిపోర్టర్ దాది చంటి, మే, 04: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు రెండున్నర ఏళ్లు గడుస్తున్నా, నేటికీ వ్యవసాయ రంగంపై కనీస పట్టు సాధించలేకపోయిందని, ప్రభుత్వ చేతగానితనానికి సామాన్య రైతాంగం బలైపోతోందని బిఆర్ఎస్ యువ నాయకులు, మల్లయ్యగూడెం గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ నారం రాజశేఖర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అశ్వారావుపేట నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల తీరు అత్యంత దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండున్నర ఏళ్లుగా (ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి) రైతుల సమస్యలు గాలికొదిలేశారని, ముఖ్యంగా ఈ యాసంగిలో వరి కోతలు పూర్తయి నెల రోజులు కావస్తున్నా కొనుగోలు కేంద్రాలు నామమాత్రంగానే దర్శనమిస్తున్నాయని మండిపడ్డారు. నాడు కేసీఆర్ పాలనలో పంట కళ్ళానికి రాకముందే గోనె సంచులు, లారీలు సిద్ధంగా ఉండేవి. కానీ నేడు కళ్ళాల్లో ధాన్యం కుప్పలపై రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. అని రాజశేఖర్ పేర్కొన్నారు. ఆకాశంలో మబ్బులు కమ్ముకొని అకాల వర్షం ముప్పు పొంచి ఉన్నా, అధికారులు తూకాలు వేయడంలో జాప్యం చేయడం మిల్లర్లకు మేలు చేయడానికేనని ఆయన ఆరోపించారు. తేమ శాతం పేరుతో క్వింటాకు ఐదు నుండి పది కిలోల వరకు కోత విధిస్తూ రైతుల పొట్ట కొడుతున్నారని, దీనిపై ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. క్వింటాకు రూ. 500 బోనస్ ఇస్తామన్న హామీని వెంటనే అమలు చేయాలని, దొడ్డు రకం ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే బాధ్యతగా కొనుగోలు చేయాలని కోరారు. తక్షణమే కలెక్టర్ స్పందించి నియోజకవర్గంలో కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, లేనిపక్షంలో రైతుల పక్షాన బిఆర్ఎస్ శ్రేణులు రోడ్లపైకి వచ్చి పోరాటం చేస్తామని నారం రాజశేఖర్ హెచ్చరించారు.