అమరవీరుల త్యాగాలను మరువొద్దు – వారి ఆశయాల సాధనకు కృషి చేయాలి.

మద్ది వంచలో ఘనంగా సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ అమరవీరుల సంస్మరణ సభ.
🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 2 మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం (రిపోర్టర్ వల్లపుదాసు వెంకటేశ్వర్లు) గార్ల మండలం మద్ది వంచ గ్రామంలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపాల వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎర్రజెండాలను ఎగురవేసి అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పార్టీ కేంద్ర కమిటీ నాయకులు కామ్రేడ్ ఎస్.వి. అన్న ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. ప్రజా ఉద్యమాల్లో ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ మరువకూడదని అన్నారు. సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజల హక్కుల సాధన కోసం అమరవీరులు చేసిన పోరాటాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. వారు ఆశించిన లక్ష్యాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం గ్రామంలోని వివిధ అమరవీరుల స్తూపాల వద్ద నాయకులు జెండాలు ఎగురవేసి నివాళులర్పించారు. గౌని ఐలన్న, గౌని వీరయ్య స్తూపాల వద్ద పార్టీ నాయకులు జెండాలను ఆవిష్కరించారు. చిర్ర పాండురంగయ్య స్తూపం వద్ద మాజీ సర్పంచ్ కుశిని బాబురావు, అమ్మానాన్నల ప్రాంగణం వద్ద మర్తి సైదమ్మ, కామ్రేడ్ మర్తి భిక్షమన్న స్తూపం వద్ద కామ్రేడ్ చిర్ర సమత, కామ్రేడ్ బాడ్సె సైదులు స్తూపం వద్ద పీసా కమిటీ అధ్యక్షులు దారావత్ భావుసింగ్ జెండాలను ఎగురవేసి అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అమరవీరుల పోరాట స్ఫూర్తిని, ప్రజా సమస్యలపై వారు సాగించిన ఉద్యమాలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వారి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల హక్కుల పరిరక్షణకు, గ్రామీణ ప్రజల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ కమిటీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు పాల్గొని అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *