
సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 02, 2026 మేడ్చల్ మల్కాజ్గిరి రిపోర్టర్ చంద్రశేఖర్ మహిళల ఆర్థిక స్వాతంత్ర్యంపై సామాజిక చైతన్యం కలిగించే అంశాన్ని ఎంచుకొని శౌర్య స్కూల్ అధినేత కారుపోతుల హేమలత–వెంకన్నల వారసుడు శ్రీధర్ రచించిన “ఆమె బ్యాంకు ఖాతా.. యూపీఐ అతని చేతిలో!” అనే శీర్షిక విశేష గుర్తింపు పొందింది.డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ తెలంగాణ వైస్ చైర్‌పర్సన్, డైరెక్టర్ జనరల్, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఐఏఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సంరిద్ధి’ కార్యక్రమంలో ఈ ఘనత సాధించారు.దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ప్రొఫెసర్లు, ఇతర సీనియర్ అధికారులు రచించిన సుమారు 1,500 శీర్షికల్లో కేవలం 15 శీర్షికలు మాత్రమే ప్రెజంటేషన్‌కు ఎంపికయ్యాయి. వాటిలో శ్రీధర్ రచన అగ్రస్థానంలో నిలిచి పోటీలో పాల్గొన్న ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంది.మహిళల పేరుతో బ్యాంకు ఖాతాలు ఉన్నప్పటికీ వాటి ద్వారా జరిగే ఆర్థిక లావాదేవీలను ఎంతమంది మహిళలు స్వయంగా నిర్వహిస్తున్నారు? ఎంతమంది భర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు, అన్నదమ్ముల పై ఆధారపడుతున్నారు? అనే అంశాలను శ్రీధర్ తన రచనలో సమగ్రంగా వివరించారు.మహిళలు తమ బ్యాంకు ఖాతాలు, యూపీఐ లావాదేవీలను స్వయంగా నిర్వహించుకుంటూ ఆర్థిక స్వాతంత్ర్యం సాధించాల్సిన ఆవశ్యకతను చక్కగా విశ్లేషించారు.శ్రీధర్ రచనను అభినందించిన శాంతికుమారి ఐఏఎస్ ప్రత్యేకంగా ప్రశంసించడంతో పాటు, ఈ శీర్షికను ప్రతిష్ఠాత్మక ‘సంరిద్ధి’ ప్రచురణలో ముద్రించేందుకు కమిటీ నిర్ణయం తీసుకుంది. తమ కుమారుడు శ్రీధర్ రచనకు దేశవ్యాప్తంగా ఉన్నతాధికారుల మధ్య ఇంతటి గుర్తింపు లభించడం పట్ల తల్లిదండ్రులు కారుపోతుల హేమలత, వెంకన్నతో పాటు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు అద్దం పట్టిన శ్రీధర్ రచనకు లభించిన ఈ గుర్తింపు పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది.