
సాక్షి డిజిటల్ న్యూస్ 02.11.26 జగిత్యాల నియోజకవర్గం ఇన్‌చార్జ్: కొడిపెల్లి సురేష్/ జగిత్యాల రూరల్: మండలంలోని తిమ్మాపూర్ గ్రామపంచాయతీలో పలు మౌలిక సమస్యలు పేరుకుపోతున్నాయని, ఎన్నిసార్లు విన్నవించినా పంచాయతీ కార్యదర్శి శ్రీలత పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో వీధి దీపాలు వెలగకపోవడం, డ్రైనేజీల శుభ్రత సక్రమంగా లేకపోవడం, తాగునీటి బావుల్లో నిర్ణీత సమయానికి బ్లీచింగ్ పౌడర్ వేయించకపోవడం, రోడ్ల పక్కన పిచ్చిమొక్కలు తొలగించకపోవడం వంటి సమస్యలు నెలకొన్నాయని వాపోతున్నారు. ముఖ్యంగా గ్రామంలోని ఒకటో వార్డులో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, ఈ విషయాన్ని పలుమార్లు కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అలాగే వార్డుల్లోని డ్రైనేజీలను సక్రమంగా శుభ్రం చేయించకపోవడంతో అపరిశుభ్రత నెలకొంటోందని, డ్రైనేజీల్లోనూ, తాగునీటి బావుల్లోనూ బ్లీచింగ్ పౌడర్ చల్లించే చర్యలు చేపట్టడం లేదని పేర్కొంటున్నారు. గ్రామంలో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, రోడ్ల పక్కన పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించాలని ఎన్నిసార్లు కోరినా స్పందన లేదని గ్రామస్తులు చెబుతున్నారు. వార్డుల్లో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు కార్యదర్శికి ఫోన్ చేసి సమాచారం అందించేందుకు ప్రయత్నించినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాల్సిన గ్రామపంచాయతీ కార్యదర్శి అందుబాటులో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా పర్యవేక్షణపై పంచాయతీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు తిమ్మాపూర్ గ్రామంలోని సమస్యలపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్యదర్శిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.