విద్య ద్వారానే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు.

జాయింట్ డైరెక్టర్ బానోత్ ధర్మానాయక్. గార్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్‌ను సందర్శించిన జాయింట్ డైరెక్టర్.
🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 2 మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం (రిపోర్టర్ వల్లపుదాసు వెంకటేశ్వర్లు) గార్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్–211ను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ బానోత్ ధర్మానాయక్ సందర్శించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి. రాజు జాయింట్ డైరెక్టర్‌కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఓపెన్ డిగ్రీ విద్యార్థులకు అందిస్తున్న విద్యా సౌకర్యాలు, తరగతుల నిర్వహణ, బోధనా విధానం తదితర అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి. రాజు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఉన్నత విద్యకు దూరమైన పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఓపెన్ యూనివర్సిటీ ద్వారా విద్యను అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. కళాశాలలో అడ్మిషన్ పొందిన విద్యార్థినీ విద్యార్థులకు ప్రతి ఆదివారం, సెలవు దినాల్లో ఓపెన్ డిగ్రీ తరగతులను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని గార్ల పరిసర ప్రాంతాల పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని వివరించారు.అనంతరం జాయింట్ డైరెక్టర్ బానోతు ధర్మానాయక్ మాట్లాడుతూ విద్య ద్వారానే ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర కృషితో చదువులో రాణించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఓపెన్ యూనివర్సిటీ ద్వారా కల్పిస్తున్న విద్యా అవకాశాలను విద్యార్థులు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని అన్నారు.గార్ల అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్‌లో తరగతుల నిర్వహణతో పాటు ఇతర విద్యా సంబంధిత కార్యక్రమాల విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే దిశగా సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో స్టడీ సెంటర్ కోఆర్డినేటర్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి. రాజు, జాక్ ఏ. రాజేష్, కౌన్సిలర్లు డాక్టర్ జి. సుందరయ్య, ఎం. వీరన్న, కార్యాలయ సబార్డినేట్ పి. పుష్ప తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *