
సాక్షి డిజిటల్ న్యూస్ జగిత్యాల నియోజకవర్గం ఇన్‌చార్జ్: కొడిపెల్లి సురేష్/ జగిత్యాల, నవంబర్ 2 జగిత్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, డిక్కీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహించే అంబేద్కర్ స్మరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు యువతలో విద్యా చైతన్యం పెంపొందించడం, సమానత్వం, సామాజిక న్యాయంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మునీరుద్దీన్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మునీరుద్దీన్ మాట్లాడుతూ.. బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన గొప్ప మహానాయకుడని కొనియాడారు. ఆయన రూపొందించిన రాజ్యాంగాన్ని వక్రీకరించేందుకు, మార్చేందుకు ప్రయత్నించే వారికి ప్రజలంతా ఐక్యంగా నిలిచి తగిన సమాధానం చెప్పాలని అన్నారు. రాజ్యాంగంలోని విలువలు, ఆశయాలను ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ వాటి పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. డిక్కీ జిల్లా కో-ఆర్డినేటర్ నల్ల శ్యామ్ మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం అనే విలువలను సమాజానికి అందించిన గొప్ప మహనీయుడని కొనియాడారు. భారత రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించి ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిన దార్శనికుడని అన్నారు. సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ జీవితాంతం పోరాటం చేశారని, విద్య ద్వారానే బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారని తెలిపారు. ఆయన ఆశయాలు, ఆలోచనలు భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. అంబేద్కర్ భావజాలాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడంతోపాటు ఆయన జీవిత చరిత్ర, సిద్ధాంతాలపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఆదివారం స్మరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు చిత్తరి ప్రభాకర్, అంబేద్కర్ యువజన సంఘం కార్యదర్శి నక్కమల లక్ష్మీనారాయణ, జగిత్యాల పట్టణ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కార్యదర్శి కంటి అంజయ్య, సుంకరపల్లి అశోక్, అంబేద్కర్ సీనియర్ నాయకులు దోమల గంగారం, గుడిసెల అశోక్, రాజు సార్, తన్నీరు నారాయణ, పులి గోవర్ధన్, రుద్ర మనోహర్, సంఖ్య మహేష్, దాసరి లచ్చయ్య, హరి, అలీముల్ షాప్, బొల్లం ప్రభాకర్, ధూమాల రాజం తదితర అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు.